మణుగూరులో నాణ్యతలేని నిత్యావసర సరుకుల విక్రయాలు?*
మణుగూరు పట్టణంలో నిత్యావసర సరుకుల విక్రయాలపై నాణ్యతకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కిరాణా దుకాణాల్లో విక్రయించే పప్పులు, నూనెలు, పిండి పదార్థాలు, మసాలా దినుసులు తదితర సరుకుల నాణ్యతపై వినియోగదారుల్లో సందేహాలు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల నాణ్యత లేని, గడువు ముగిసిన సరుకులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు నిత్యం కొనుగోలు చేసే ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించకపోతే వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. తక్కువ ధరకు సరుకులు కొనుగోలు చేస్తున్నామనే నమ్మకంతో ప్రజలు నాణ్యతను పట్టించుకోకుండా కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల తనిఖీలు ఏమైనట్లు?ఆహార భద్రత, తూనికలు కొలతల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సరుకుల నాణ్యత, తయారీ తేదీలు, గడువు తేదీలు, ప్యాకింగ్ వివరాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యం.. వ్యాపార లాభాలే పరమావధి కాకూడదు, నాణ్యతలేని సరుకుల విక్రయాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపడతారా? లేక ప్రజలే నాణ్యతను గుర్తించుకుని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.